నితిన్ గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం పరితపిస్తున్నాడు. ఏ కథ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అర్దం కాని సిట్యువేషన్ ని ఆయన ఫెయిల్యూర్స్ క్రియేట్ చేసాయి. ఈ క్రమంలో తాజాగా ‘తమ్ముడు (2025)’ అంటూ వచ్చాడు. ఈ తమ్ముడు కు వెనక సపోర్ట్ గా దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత, వేణు శ్రీరామ్ వంటి దర్శకుడు నిలబడ్డారు. మరి ఈ తమ్ముడు గెలిచాడా, వీళ్లందరూ కలిసి తమ్ముడుని గెలిపించారా చూద్దాం.

కథేంటి

జై (నితిన్) జీవితాశయం… భారతదేశం తరఫున ఆర్చరీలో గోల్డ్ మెడల్ గెలవాలని. కానీ తన ఫోకస్ పూర్తిగా ప్రాక్టీస్ మీద ఉండదు. ఎందుకంటే… చిన్నప్పటి ఒక సంఘటన అతడిని మానసికంగా వెంటాడుతుంటుంది — తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ (లయ) విషయంలో తాను చేసిన ఒక చిన్న తప్పు.

ఆ తప్పు వల్లే ఆమె చిన్నప్పుడే జైను దూరంగా పెట్టి, పుట్టింటిని వదిలి వెళ్లిపోతుంది. అప్పటి నుంచి ఆమెను మళ్లీ కలవలేని బాధలో ఉండే జై, తన బాధను చెబుతూ అక్కను మళ్లీ కలవాలని సంకల్పిస్తాడు. ఈ క్రమంలో తన స్నేహితురాలు చిత్ర (వర్ష బొల్లమ్మ)తో కలిసి ఆమె కోసం విశాఖపట్నం వెళ్తాడు.

అక్కడ ఆమె అంబరగొడుగు అడవుల్లో జరుగుతున్న అమ్మవారి జాతరకి తన కుటుంబంతో వెళ్లిందని తెలుసుకుంటాడు. జై అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో ఇండ్రస్టిలియస్ట్ అజార్వాల్ (సౌరభ్ సచ్‌దేవా) తన ముఠాను ఝాన్సీపై పంపిస్తాడు. ఎందుకంటే… ఓ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఝాన్సీ ఇచ్చిన హామీ. అది అజార్వాల్ బిజినెస్ కు అడ్డుగా మారుతుంది.

ఇక్కడే కథకు మలుపులు మొదలవుతాయి.

జై తన అక్కను ఆ ముఠా నుంచి ఎలా రక్షించాడు?
ఆ ప్రమాద సమయంలో అతనికి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలా సాయం చేసింది?
అక్కను విడిచిపెట్టాల్సి వచ్చిన చిన్నప్పటి తన తప్పు ఏంటి?
ఆ తప్పును ఎలా సరిచేసుకున్నాడు?

చివరకు ఆమెకు తాను నిజంగా మారిపోయానని, అర్హుడినే అని ఎలా నిరూపించుకున్నాడు?

ఇవన్నీ తెలియాలంటే ఓపిక చేసుకుని సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

అక్క కోసం తమ్ముడు నిలబడటం అనేది ఎన్నో సార్లు తెరపై చూసిన కథే. అయితే కొత్త కథలు ఎక్కడనుంచి వస్తాయి, హీరో తన స్టాండ్ మార్చుకోనప్పుడు. ఇంకా సెంటిమెంట్ తో భాక్సాఫీస్ ని గెలవాలనుకున్నప్పుడు, కొన్ని ఫైట్స్, కొన్ని ఎమోషన్ సీన్స్ తో కథ నింపేస్తే జనం చూసేస్తారా, ఆ రోజులు ఇంకా నడుస్తున్నాయా. ఓ ప్రక్కన ఓటిటిలో కొత్త కాన్సెప్టులు నడుస్తున్న ఈ సమయంలో అనిపిస్తుంది. తెలుగు సినిమా ఓ చోట ఆగిపోయిందా అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు చూస్తుంటే. బీజం ఒకటేసి మరో మొక్క రమ్మంటేరాదు కదా. అలాగే అరిగిపోయిన కాన్సెప్టు తీసుకుని దానికి ఎన్ని హంగులు కూర్చినా ఆ పాత వాసనలే వస్తాయి. అదే ఇక్కడా జరిగింది. అక్క కోసం బయిలు దేరిన తమ్ముడు వరస పెట్టి యాక్షన్ సీక్వెన్స్ లు చేసుకుంటూ పోతూంటే మనం ఆవలించటం తప్ప చేయగలిగేది ఏముంటుంది.

ఈ సినిమా ప్రారంభం ఓ బలమైన విలన్ పరిచయంతో వస్తుంది. బాగుంది అనుకుంటాం. అయితే గమ్మత్తుగా అదే ఎఫెక్ట్ హీరో ఇంట్రడక్షన్‌కి మాత్రం రాలేదు. చాలా రొటీన్ గానే నితిన్‌ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడినుంచి ఇంటర్వెల్ వరకు సినిమా రెండు చక్రాలపై నడుస్తుంది – యాక్షన్ & ఎమోషన్. ఆ రెండింటిలోనూ కొత్తదనం కనిపించదు.

అక్క-తమ్ముళ్ల బంధమే సినిమాలో మెయిన్ కావాల్సింది. కానీ,అందుకు తగ్గ సీన్స్ కానీ నేపధ్యంగానీ ఉండదు. అక్క ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న సీన్ కూడా ఎమోషనల్‌గా కాక, డ్రైగా అనిపిస్తుంది. నితిన్‌కు ఉన్న మెంటల్ బ్లాక్, తన చేసిన తప్పు గురించి ఉన్న గిల్ట్ — ఇవన్నీ స్క్రీన్‌పై చూసేవారిని కదిలించాల్సింది. కానీ, పాత సినిమాల్లో చూశాం అనిపించేలా తేలిపోయింది.

అంతెందుకు నితిన్ విలువిద్యలో మాస్టర్ అని చెప్పినా, ఆ టాలెంట్‌కు స్క్రీన్‌పై సరిగ్గా స్కోప్ ఇవ్వలేదు. అడవిలో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ డెఫెనిట్‌గా ఖర్చు పెట్టారు, విజువల్స్ బాగున్నాయి. కానీ వాటి వెనుక ఏమి పోరాటం ఉంది? అనేది కనపడదు.

హీరోయిన్ ట్రాక్ – అసలే అవసరమా?

వర్ష బొల్లమ్మ పాత్ర రేడియో జాకీలా మారి, హీరోకి ఓవర్ గా మార్గదర్శనం చేస్తూ మాట్లాడటం చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. ఆ ట్రాక్ ఏ దిశలో పోతుందో కూడా స్పష్టత లేదు. స్క్రిప్ట్‌లో వదిలేసిన క్యారెక్టర్‌లా ఉంటుంది.

సెకండాఫ్ మొత్తం ఒక్క రాత్రిలో జరుగుతుంది. ఈ తరహా సెట్టింగ్ ఎన్నో సినిమాల్లో చూశాం. ఇలాంటి చోట టెన్షన్ ఉండాలి. ఎమోషనల్ ఒత్తిడి ఉండాలి. అవేమీ పట్టించుకోకుండా ఒకే గేర్‌లో కథ నడుస్తుంది. విలన్ క్యారెక్టర్ – ఇంట్రడక్షన్ వరకు బాగుంది, కానీ డెవలప్ చేయలేదు. ఇలా తమకు తోచినట్లు రాసేసి ,తీసుకుంటూ వెళ్ళిపోయారు.

టెక్నికల్ గా ..

అజనీష్ ఇచ్చిన BGM – కొన్ని చోట్ల సినిమా నిలబెట్టింది. కెమెరా వర్క్ బాగుంది.అడవి విజువల్స్, కొన్ని యాక్షన్ బ్లాక్స్ విజువలీ స్టైలిష్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ ..కాస్త ఇబ్బంది పెడుతుంది. అయినా ఇలాంటి కథకు ఎడిటర్ మాత్రం ఏం చేస్తాడు అనిపిస్తుంది.

నితిన్ కొత్తగా కనపడింది లేదు. చేసింది లేదు. లయ రీఎంట్రీ బాగుంది కానీ చెప్పుకోవటానికి ఏముంది కనుక, ఇక హీరోయిన్స్ పాత్రలు వాళ్లకు ఏం చెప్పారో, ఏం తీసారో అనిపిస్తుంది.

ఫైనల్ వర్డిక్ట్:

“తమ్ముడు” అనేది ఎమోషనల్ యాక్షన్ డ్రామా కావాలనే ప్రయత్నం. కానీ ఎమోషన్ ఫౌండేషన్ లేకపోవడంతో, యాక్షన్ కూడా ఆ హీట్ అందుకోలేక చతికిల పడిపోయింది.

ఇది ఓ కాగితంపై బలంగా ఉన్న కథ, కానీ తెరపై హృదయాన్ని తాకని ప్రయత్నం.

చూడవచ్చా?

నితిన్, లయ అభిమానులకు ఓ మోస్తరుగా నచ్చుతుందేమో.
అయితే కొత్తదనం కోరే వారికి… ఈ సినిమాని ఎవాయిడ్ చేయటమే మేలు.

, , , , ,
You may also like
Latest Posts from