పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన‌ హిస్టారికల్ వార్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఆయన అభిమానులు ‘ఓజీ’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల కొన్ని రూమర్లు చక్కర్లు కొట్టినా, చిత్ర టీమ్ వాటికి చెక్ పెడుతూ వస్తోంది. ‘ఓజీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు.

తాజా సమాచారం ప్రకారం, “OG” ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18న ఆంధ్రప్రదేశ్‌లో గ్రాండ్‌గా జరగబోతుందట. అయితే మేకర్స్ అధికారిక అనౌన్స్‌మెంట్ మాత్రం ఇవ్వలేదు. అప్పటివరకూ ఫ్యాన్స్ కు సస్పెన్సే.

అదే సమయంలో అమెరికాలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఆగస్టు 29 నుండి అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలు జరుగనున్నాయి. దీంతో సినిమా విడుదలపై ఎటువంటి జాప్యం లేదని స్పష్టమవుతోంది.

అమెరికాలో మాత్రమే కాదు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో బజ్ కనిపిస్తోంది. హరిహర వీరమల్లు ఫలితం ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్‌తో పాటు ‘ఓజీ’ ట్రైలర్లు, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి.సినిమాకు సంగీత దర్శకుడు తమన్ అందించిన ట్యూన్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ‘నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా’ పాటతో మొదలైన హైప్, ఇటీవల విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ పాటతో మరింత పెరిగింది. దర్శకుడు సుజీత్ స్టైలిష్ టేకింగ్, పవన్ పవర్‌ఫుల్ లుక్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలతో పవన్ ఎప్పుడూ హిట్ అందుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ‘ఓజీ’లో ఓజస్ అనే పాత్రలో పవన్ మరోసారి యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నాడు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలే అభిమానుల్ని ఫుల్ ఎగ్జైట్ చేశాయి.

ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, ఆయన కుమారుడు దాసరి కళ్యాణ్ కలిసి నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి వంటి కీలక నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సెప్టెంబర్ 25న ‘ఓజీ’ థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో, ఫ్యాన్స్ సంబరాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. రీల్‌లోనే కాదు, రియల్‌లోనూ పవర్ స్టార్ పవర్ చూపించబోతున్నారని అభిమానులు విశ్వాసంతో ఎదురుచూస్తున్నారు.

, , ,
You may also like
Latest Posts from