
మాలీవుడ్ పరిశ్రమను మాత్రమే కాదు, మొత్తం దక్షిణాదిని కుదిపేస్తున్న సంచలన వ్యవహారం — ‘ఆపరేషన్ నుమ్ఖోర్’!
సినిమా రంగానికే పరిమితం కాని ఈ కేసు ప్రభావం ఇప్పుడు బిజినెస్, రాజకీయ వర్గాల వరకూ విస్తరించింది. కానీ చర్చలన్నీ మాత్రం ఫోకస్ అయ్యాయి ఇద్దరు స్టార్ హీరోల మీద — దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్!
ఇద్దరి పేర్లు బయటకు రావడంతో మాలీవుడ్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా దుల్కర్ సల్మాన్‌కు కేరళ హైకోర్టు నుంచి ఊరట లభించింది.
లగ్జరీ కారు స్వాధీనం విషయంలో వారంలోగా నిర్ణయం చెప్పాలని కస్టమ్స్ విభాగానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో దుల్కర్ తన కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సమర్పించగా, కస్టమ్స్ అధికారులు షరతులతో కారు విడుదలకు సిద్ధమయ్యారు.
వారు స్పష్టంగా చెబుతున్నారు — కార్ విలువలో 20% మొత్తాన్ని బ్యాంక్ గ్యారంటీగా ఇవ్వాలని; అప్పుడు మాత్రమే కార్ రిలీజ్. దుల్కర్ కారుతో పాటు మరో వ్యక్తి వాహనాన్ని కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం.
ఇక ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్న ‘భూటాన్ కనెక్షన్’ గురించి చెబితే — ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, భూటాన్ ఆర్మీ తన వాహన శ్రేణిలోని ఖరీదైన కార్లను వేలంలో తక్కువ ధరకు విక్రయించింది. ఆ వాహనాలను కొందరు ఏజెంట్లు కొనుగోలు చేసి, కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారు!
హిమాచల్ ప్రదేశ్ మీదుగా ఆ కార్లు భారత్‌లోకి వచ్చి, కొందరు సినీ, వ్యాపార ప్రముఖుల వద్దకు చేరాయని విచారణలో తేలింది.
40 కంటే ఎక్కువ లగ్జరీ కార్లను సీజ్ చేసిన ఈ ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ప్రస్తుతం మాలీవుడ్‌లోనే కాదు, మొత్తం దక్షిణ భారత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
“భూటాన్ నుంచి వచ్చిన లగ్జరీ కార్లు… స్టార్ హీరోల గ్యారేజీల్లో ఎలా చేరాయి?”
“ఆపరేషన్ నుమ్ఖోర్ తర్వాత ఎవరి వరకు చేరబోతుంది ఈ దర్యాప్తు?”
తదుపరి ఎపిసోడ్ కోసం అందరి చూపు ఇప్పుడు కేరళ కస్టమ్స్ వైపే..!
