సినిమా కథకు ఓ మంచి పాయింట్ తట్టడమే చాలా కీలకం. అలాంటి పాయింట్ ఈ కోర్ట్ సినిమా కథలో కుదిరింది. ఎమోషన్ పాయింట్. కాకపోతే ఈ పాయింట్ సంపూర్ణమైన కథగా మార్చడంలో ఇటు రచయిత అటు దర్శకుడు ఏ మాత్రం కష్టపడ్డారు. నిర్మాతగా నాని చేసిన ప్రమోషన్ కు తగినట్లుగా సినిమా ఉందా, ‘పోక్సో చట్టం పై అవగాహన కలిగించే ఈ చిత్రం సామాన్యులకు నచ్చుతుందా, కథేంటి వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

విశాఖ‌ప‌ట్నం నేపధ్యంలో జరిగే కథ ఇది. చందూ (రోష‌న్‌) అనే ఓ టీనేజ్ కుర్రాడు, జాబిల్లి (శ్రీ‌దేవి) అనే ప‌దిహేడేళ్ల అమ్మాయి ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇది జాబల్లి కుటుంబానికి బాగా దగ్గరైన పెద్దమనిషి మంగ‌ప‌తి (శివాజీ) కు మండుతుంది. తమ కన్నా తక్కువ కులం, బాగా లో మిడిల్ క్లాస్ కుర్రాడు తమ అమ్మాయి వెనకపడటం ఏమిటని కోప్పడతాడు. అక్కడితో ఆగడు. వీళ్లిద్దరని విడతీయాలనే ప్రాసెస్ లో కుర్రాడిపై రకరకాల కేసులతో విరుచుకుపడతాడు. తన పలుకుబడి, రాజకీయ నేపధ్యం వాడతాడు.

78 రోజుల పాట బెయిల్ లేకుండా రిమాండ్ లోనే ఉంచేలా చేస్తాడు. పోక్సో కేసు పెట్టడంతో బలంగా ఇరుక్కుంటాడు. ఆ కుర్రాడిపై జాలి పడటం తప్ప ఏమి చేయలేని పరిస్దితి. కోర్ట్ కూడా చేతులెత్తేసి చందుని దోషి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసే పరిస్దితికి వస్తుంది. ఆ టైమ్ లో ఏ లాయర్ కూడా వాదించటానికి రానప్పుడు జూనియ‌ర్ లాయ‌ర్ సూర్య తేజ (ప్రియ‌ద‌ర్శి) సీన్ లోకి వస్తాడు. అతనికి ఆ కుర్రాడు అన్యాయమైపోతున్నాడనిపిస్తుంది. దాంతో చందూని కాపాడటానికి ముందుకు వస్తాడు. మరి కొత్తగా కోర్టులో ప్రవేశించే తేజ…సూర్య కాపాడాడా? న్యాయం జ‌రిగిందా?

ఎలా ఉంది

కథగా చూస్తే పెద్దగా ఏమీలేదనిపిస్తుంది. పెద్దింటి అమ్మాయి, పేదింటి కుర్రాడు, మధ్యలో పోక్సో కేసు అన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇందులో పోక్సో కేసు అనేదే బలంగా చెప్పే ప్రయత్నం చేసారు దర్శకుడు. ఆ పాయింట్ చుట్టూనే సెకండాఫ్ మొత్తం తిరుగుతుంది. ఫస్టాఫ్ మొత్తం లవ్ స్టోరి, కుర్రాడిపై కేసులు పెట్టడంతోనే సరిపోతుంది. సెకండాఫ్ ని పూర్తిగా కోర్ట్ లో సెట్ చేసి నడిపారు.

అయితే ఇంత స్ట్రాంగ్ పాయింట్ కథలో ఉన్నా సినిమాలో డైరక్టర్ చాలా చోట్ల సినిమాటెక్ లిబర్టిని తీసుకుని తనకు కన్వీనెంట్ గా సీన్స్ రాసుకోవటం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఇలాంటి కథలకు నాచురల్ నేరేషన్ అవసరం. ఎక్కడా మనం ఊహించని మలుపులు అయితే ఉండవు.అలాగే అక్కర్లేని సీన్స్ కూడా పెద్దగా కనపడవు. ఏదైమైనా ఇలాంటి సబ్డెక్ట్ ని తీసుకుని చట్టంపై అవగాహన కల్పిస్తూ సినిమా తీసిన దర్శక,నిర్మాతలని మాత్రం అభినందించాల్సిందే.

టెక్నికల్ గా

నాని నిర్మాత కావటం ఈ సినిమాకు కలిసి వచ్చింది. ఈ సినిమాకు మెయిన్ హైలెట్ బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ మ్యాజిక్. ప్రేమలో సాంగ్ ఇప్పటికే బాగా పాపులర్. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంది. సినిమాలో ఉన్న మిగిలిన రెండు పాటలు కూడా బాగున్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ స్పీడుగా పరుగెత్తేలా షార్ప్ గా ఉంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ క్లాస్ గా ఉంది. ఇక నాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కొత్త దర్శకుడు రామ్ జగదీష్ నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. నాని ఈ సినిమాకు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చి సహకరించాడు.

నటీనటుల్లో..

కమిడియన్ ప్రియదర్శి ఈ సినిమాలో కొత్తగా కనపడతాడు. తన పాత్రను.. ఛాలెంజింగ్ గా తీసుకుని చేసాడు. హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్రలో చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. కొత్తమ్మాయి శ్రీదేవి బాగుంది.. సాయి కుమార్ ఎప్పటిలాగే బాగా చేసారు. ఈ సినిమాలో హైలెట్ శివాజీ నటన అని చెప్పాలి. తనలోని సరికొత్త విలన్ ని పరిచయం చేసి చూపించాడు శివాజీ. రోహిణి, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

చూడచ్చా

ఇదో కోర్టు డ్రామా..! పోక్సో చట్టం పై అవగాహన కోసం చూడదగ్గ సినిమా.

, , ,
You may also like
Latest Posts from