రాజమౌళి లాంటి విజువల్ మాస్టర్ ఒక సినిమాని చూసి, “ఇది నాకు ఇటీవలి కాలంలో లభించిన ఉత్తమ సినిమాటిక్ అనుభూతి” అన్నారు అంటే… ఆ సినిమాలో ఏదో స్పెషల్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. స్టార్ హీరోలూ లేని, బడ్జెట్ పెద్దగా లేకున్నా… ఓ చిన్న సినిమా, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ఇప్పుడు నేషనల్ లెవల్లో everyone’s talking point అయింది. కారణం? ఎస్.ఎస్. రాజమౌళి మెచ్చుకోవటం! ఇంతకీ రాజమౌళి ఏమన్నారు.
ఎస్.ఎస్. రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “అద్భుతమైన సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చూశాను. మనసును హత్తుకునేలా, కడుపుబ్బా నవ్వించే హాస్యంతో నిండి ఉంది. ఆరంభం నుంచి చివరి వరకు నన్ను ఆసక్తిగా ఉంచింది. గొప్ప రచన, దర్శకత్వం అబిషన్ జీవింత్ గారిది. ఇటీవలి సంవత్సరాలలో నాకు లభించిన ఉత్తమ సినిమాటిక్ అనుభవానికి ధన్యవాదాలు. దీన్ని తప్పక చూడండి” అని రాజమౌళి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
రాజమౌళి వంటి అగ్ర దర్శకుడి నుంచి ప్రశంసలు రావడంతో దర్శకుడు అబిషన్ జీవింత్ ఉబ్బితబ్బిబ్బి అవుతున్నాడు. ఆయన రాజమౌళి ట్వీట్‌కు బదులిస్తూ, “చాలా ధన్యవాదాలు, రాజమౌళి సర్! మీ ట్వీట్ మాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది, ఇది నిజంగా మా రోజును మరింత ప్రత్యేకంగా మార్చింది. మాటలకు అందని కృతజ్ఞతలు” అని తెలిపారు.
అంతేకాకుండా, “ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను… ఆయన సినిమాలను ఎంతో ఆసక్తిగా చూసేవాడిని, కానీ ఒకరోజు ఆ అద్భుత ప్రపంచాలను సృష్టించిన వ్యక్తి నా పేరును ప్రస్తావిస్తారని ఎప్పుడూ ఊహించలేదు. రాజమౌళి సర్, మీరు ఈ కుర్రాడి కలను జీవితానికంటే పెద్దదిగా చేశారు” అంటూ తన అనుచరులతో ఆనందాన్ని పంచుకున్నారు.
మే 1న విడుదలైన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ తక్కువ బడ్జెట్ మూవీ అయినా, కంటెంట్‌తోనే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ‘రెట్రో’, ‘హిట్: ది థర్డ్ కేస్’ లాంటి పెద్ద సినిమాల మధ్య విడుదలై రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ చిత్రంలో శశికుమార్, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటించగా, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్, మిథున్ జయశంకర్ తదితరులు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. షాన్ రెహమాన్ సంగీతం, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం పోశాయి.
ఇంతకీ… జక్కన్న మెచ్చిన సినిమా మీరూ చూడాలనిపించలేదా?