ఈ మధ్యకాలంలో కేవలం టైటిల్‌తోనే అందరిని ఆకర్షించిన చిత్రం ఏదైనా ఉందీ అంటే అది ‘గాంధీ తాత చెట్టు’. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె ‘సుకృతి వేణి’ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రిలీజ్ కు ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. సుకుమార్‌ భార్య తబితా సుకుమార్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం కథేంటి, మైత్రీ మూవీస్ వంటి పెద్ద బ్యానర్ ఇలాంటి చిన్న చిత్రం చేయటానికి ముందుకు రప్పించిన కంటెంట్ ఏమిటి, సినిమా ఎలా ఉంది వంటి విశేషాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

గాంధేయవాది రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) అంటే ఆ ఊరిలో అందరికీ ఇష్టం. ఆయన మనుష్యులతో పాటు చెట్టు,పుట్టలను కూడా అంతే సమానంగా, ప్రేమగా చూడగలరు. ఆ క్రమంలో ఆయన ఓ చెట్టుతో స్నేహం చేస్తుంటాడు. అంతేకాదు తన కొడుకు కూతురుకు గాంధీ (సుకృతి వేణి) అని పేరు పెట్టుకుంటాడు. ఆ పాపకు గాంధీకి తాత అంటే ఎంతో ఇష్టం. తన తాత పాటించే గాంధీ భావాలను, విలువలను తను కూడా గౌరవించి పాటిస్తుంది. తోటి స్నేహితులను కూడా అదే దారిలో నడిచేలా ప్రేరణ ఇస్తూంటుంది.

ఇలా ప్రశాంతంగా ఆ ఊరు ఉన్న సమయంలో అక్కడికి కెమికల్‌ ఫ్యాక్టరీ స్థాపన కోసం సతీష్‌ (రాగ్‌ మయూర్‌) వస్తాడు. ఆ ఊరిలో అందరి పొలాలను తమ ఫ్యాకర్టీ కోసం అమ్మాలని అడుగుతాడు. అసలే వ్యవసాయం లాభసాటిగా లేదు అనుకుంటూంటే…మరో ప్రక్క ఊరిలో పండించిన చెరకు పంటను కూడా తీసుకోవడానికి షుగర్‌ ఫ్యాకర్టీ వాళ్లు కూడా నిరాకరిస్తారు. దాంతో ఇంక పూర్తిగా వ్యవసాయం చేయడం లాభం లేదని, గ్రామస్తులందరూ సతీష్‌కు పొలాలను అమ్మేస్తారు. బ్రతుకు తెరువుకు వేరే చోటకు వెళ్లిపోదామనుకుంటారు.

కానీ రామంచంద్రయ్యకు మాత్రం అది ఇష్టం ఉండదు. తన పొలాన్ని ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ సతీష్ ఒప్పుకోడు. నయానో, భయాన్నో ఆ పొలాన్ని లాగేయాలనుకుంటాడు. పనిలో పనిగా ఆ చెట్టు అంతం చూడాలనుకుంటాడు. అప్పుడు జరిగిందేమిటి? ఈ క్రమంలో రామచంద్రయ్య కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? తాత అడుగుజాడల్లో మనవరాలు గాంధీ ఎలా నడిచింది, ఉద్యమం చేసింది, చివరకు తన చెట్టుని , తన ఊరుని ఎలా కెమికల్ ఫ్యాక్టరీ కబంధ హస్తాల నుంచి ఎలా తప్పించింది? అనేది మిగతా కథ.

ఎలా ఉంది

రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రంగా చూస్తే అసలు నచ్చదు. కానీ ఓ విభిన్నమైన ప్రయత్నంగా, గాంధీ మహాత్ముడు విలువలను, వచనాలను ఈ కాలానికి చెప్పాలని ప్రయత్నించిన చిత్రంగా చూస్తే హృదయానికి హత్తుకోవాలనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేజీఎఫ్ రోజుల్లో హింస లేనిదే సినిమా తీయలేము అనుకుంటున్న సమయంలో ఓ పల్లెటూరి వాతావరణంలో ఎటువంటి రక్తపాతం, హింస లేకుండా స్టోరీని నేరేట్ చేయటం ఓ పెద్ద విజయం అని చెప్పాలి.

ఈ చిత్రం దర్శకురాలు పద్మావతి మల్లాది తొలి చిత్రాన్ని కమర్షియల్ గా మలచాలనుకోకుండా, ఓ సందేశాత్మకమైన చిత్రంగా ఆలోచింపజేసే కథతో రావటం ఆనందపరిచే విషయం. ముఖ్యంగా గాంధీ పాత్రను, ఆ పాత్రను డిజైన్‌ చేసిన విధానం, కథలో ఎమోషన్‌ పండించిన విధానం బాగున్నాయి. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంతో సహజంగా మలిచారు.

అయితే ఫస్టాఫ్ లో అక్కడక్కడా కాస్త స్లో అనిపిస్తుంది. సెకండాఫ్ లో కథ కాంఫ్లిక్ట్ లోకి ప్రవేశించాక ఎమోషన్స్ అందరి హృదయాలను హత్తుకుంటుంది. మనం పీల్చే గాలి విలువ, చెట్ల పెంపకం ఇలాంటి అంశాలను వివరించటంలో సఫలీకృతులయ్యారు. అయితే అక్కడక్కడా తగిలే సినిమాటిక్‌ గా అంశాలు మాత్రం పంటిక్రింద రాళ్లలా అనిపిస్తాయి. అలాగే కెమికల్ ఫ్యాక్టరీ ఊరికి రావటం , పొలాలు అమ్మేయటం వంటి విషయాలు కొత్తగా అనిపించవు, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ గా అనిపిస్తాయి.

హైలెట్స్

సినిమాలో తాత-మనవరాళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా గాంధీ (సుకృతి వేణి) గుండు కొట్టించుకునే సీన్‌తో పాటు పతాక సన్నివేశాలు అందరి హృదయాలను బరువెక్కిస్తాయి. రామచంద్రయ్యగా చక్రపాణి ఆ పాత్రలో జీవించాడు. సతీష్‌ పాత్రలో రాగ్‌ మయూర్‌ నటన చాలా బాగుంది. మరీ ముఖ్యంగా గాంధీ పాత్రలో సుకృతి వేణి నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. అసలు ఆమెది మొదటి సినిమా అంటే నమ్మబుద్ది కాదు.

చూడచ్చా

ఖచ్చితంగా పిల్లలకు చూపించాల్సిన సినిమా. చిన్న వయస్సులోనే ఇలాంటి సినిమాలు చూపించటం ద్వారా గాంధీని, ఆయన అహింసాయుత సిద్దాంతాలను ఈ తరానికి పరిచయం చేసినట్లు అవుతుంది.

, ,
You may also like
Latest Posts from