ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతున్న కంటెంట్ పట్ల కేంద్రం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. A రేటింగ్ ఉన్న కంటెంట్‌తో పాటు అశ్లీల కంటెంట్‌ను కూడా అందుబాటులో ఉంచడం చట్టరిత్యా నేరం అని, వీటిని కట్టడి చేసేలా నిబంధనలను రూపొందించాల్సింది కేంద్రమే’నని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఇప్పటికే పేర్కొంది.
అయితే తాజాగా అశ్లీల కంటెంట్ ప్రసారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటీటీ సంస్థలకే కాకుండా పలు సామాజిక మాధ్యమాల హ్యాండిళ్లకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఉల్లు, ఆల్ట్‌టీ ఓటీటీతో పాటు ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లకు సుప్రీమ్ కోర్టు నోటీసులిచ్చింది.
సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్‌ను అడ్డుకోవాలని గతంలో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది.
వాదనల అనంతరం అశ్లీల కంటెంట్‌పై కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్ వేదికల్లో లైంగిక, అశ్లీల కంటెంట్ తీవ్రమైన విషయమని, వెంటనే ఈ అంశంపై విచారణ జరపాలని న్యాయవాది జైన్ విజ్ఞప్తి చేశారు.
చట్టం ప్రకారం నిషేధించిన ఏ కంటెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం చేయకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.