సినిమాల్లో అసభ్య నృత్యాలు చాలా కాలంగా ఉన్నవే. అయితే అవి ఈ మధ్యన చాలా శృతి మించాయి. ఈ మధ్యన వచ్చిన కొన్ని సినిమాల్లోని పాటలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఎక్కడా ఎవరూ తగ్గటం లేదు మారటం లేదు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం అసభ్యకరంగా పాటల్లో స్టెప్స్ వేస్తున్నారు.

ఇక ఐటమ్ సాంగ్స్ (Item Songs) సంగతి అయితే చెప్పక్కర్లేదు. నిర్మాతలు, దర్శకులు ఇలాంటి పాటలే అడుగుతున్నారంటే కొరియోగ్రాఫర్స్ ఒకరితో ఒకరు పోటీపడుతూ, పరమ దారుణమైన స్టెప్స్ ను కంపోజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టి సారించింది. తాజాగా ఓ హెచ్చరికనూ జారీ చేసింది.

మహిళా కమిషన్ (Commission for Women) ఛైర్ పర్శన్ నేరెళ్ళ శారద (Nerella Sarada) తాజాగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు తమకు అందాయని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కమిషన్ తీవ్రంగా తీసుకుంటున్నట్టు తెలిపారు.

సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని కమిషన్ ఛైర్ పర్శన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు, సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరించింది.

మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలని, తమ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అలాగే సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యతగా భావించాలని, అలానే యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతేకాదు… ఈ అంశాలపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చ తెలిపారు. తమకు అందే ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

, , , , , ,
You may also like
Latest Posts from