విభిన్నమైన టైటిల్ లేకపోతే జనం ఆసక్తి చూపించటం లేదు. అది దర్శక,నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే తమ సినిమాలకు కొత్త తరహా టైటిల్స్ పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అదే క్రమంలో నాగచైతన్య కొత్త చిత్రానికి ‘వృషకర్మ’ టైటిల్ పెట్టబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..
నాగ చైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీని చేయబోతున్నారు. ఇప్పటికి దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిన విషయం తెలిసిందే. షూటింగ్ లాంచనాలతో మూవీ స్టార్ట్ అయ్యింది కూడా.
ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు.
2025 చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఇంకా ఈ మూవీకి మేకర్స్ టైటిల్ ని ఖరారు చేయలేదు.
తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య – కార్తీక్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు ‘వృషకర్మ’ అనే టైటిల్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘వృషకర్మ’ అనే టైటిల్ తో పాటు మరికొన్ని టైటిల్స్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.