జీ5 ప్లాట్‌ఫారంలో ఇటీవల స్ట్రీమింగ్ అవుతున్న థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ “విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్” ఇప్పుడు కథకన్నా ఎక్కువగా వివాదాలతో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కథ తమదేనని చెప్పుకుంటున్న రచయిత ప్రశాంత్ దిమ్మల ఇటీవల మీడియా సమావేశం పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈటీవీ విన్ సమర్పణలో సృష్టించిన ఓ స్క్రిప్ట్‌ను కాపీ చేశారని, జీ5 సీరీస్ అనేది కాపీరైట్ ఉల్లంఘనకు నిదర్శనమని ఆయన వాదించారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధమని కూడా ప్రకటించారు.

ఈ ఆరోపణలపై జీ5 సంస్థ అధికారికంగా స్పందిస్తూ, ఇది తాము చాలా సీరియస్‌గా తీసుకున్న అంశమని తెలిపింది. అయితే, ప్రస్తుతం విషయం చట్టపరంగా విచారణలో (sub-judice) ఉన్నందున బహిరంగంగా ఎక్కువ మాట్లాడటం తగదని స్పష్టం చేసింది.

అయితే ప్రశాంత్ దిమ్మల టీమ్ ఉద్దేశపూర్వకంగా మీడియా సమావేశం పెట్టి బలహీనమైన ఆరోపణలతో తాము చేసిన కంటెంట్‌పై దుష్ప్రచారం చేశారని జీ5 ఆవేదన వ్యక్తం చేసింది.

అసలు వాస్తవాలు తెలియకుండా, అసంపూర్తి సమాచారం ఆధారంగా తమ సంస్థ గౌరవాన్ని మంటగలిపే ప్రయత్నం చేశారని ఆరోపించింది.
ప్రశాంత్‌ వర్గం అందించిన ఆరోపణల్లో ఏ ఆధారాలు లేవని, ఇది బురద చల్లే ప్రయత్నం మాత్రమే అని ఖండించింది.

జీ5 చెబుతున్నది ఏమిటంటే:

తమ కంటెంట్‌ను జాగ్రత్తగా, చట్టబద్ధంగా తయారు చేస్తామనీ,

రచయితల హక్కులను కాపాడేందుకు పూర్తిగా కట్టుబడి ఉంటామనీ,

ఈ అసత్య ఆరోపణలపై చట్టపరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించామని,

అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.

అంతేకాదు, తప్పుడు ప్రచారాలు ఆపాలని, చట్టపరమైన పరిష్కారాలకే పరిమితమవాలని అందరినీ కోరింది.

“తమ ప్రతిష్టను కాపాడుకోవడం, సత్యాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నాం” అంటూ జీ5 క్లారిటీ ఇచ్చింది.

ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందో చూడాలి కానీ, విరాటపాలెం వెబ్ సిరీస్ ఇప్పుడు ఆన్‌స్క్రీన్ కంటే ఆఫ్‌స్క్రీన్లోనే ఎక్కువగా న్యూస్‌లో ఉంది!

,
You may also like
Latest Posts from