టాలీవుడ్‌కు తనదైన శైలిలో వినోదం పంచిన నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు. జూలై 18 రాత్రి కిడ్నీ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయకపోవడంతో డయాలసిస్‌పై ఆధారపడి జీవించాల్సి వచ్చేది. డాక్టర్లు వెంటనే కిడ్నీ మార్పిడి అవసరమని సూచించారు. కానీ దాత దొరకకపోవడం, ఆర్థికంగా వెనుకబడటం వల్ల సరైన చికిత్స అందించలేకపోయారు.
తండ్రి ప్రాణాల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందంటూ వెంకట్ కుమార్తె స్రవంతి కన్నీళ్లు కట్టలేదు.
“రూ. 50–60 లక్షలు వైద్యానికి అవసరం అని డాక్టర్లు చెప్పారు. ఎవరి వద్దకైనా వెళ్లాం. ఎంతోమందికి ఫోన్ చేసాం. కానీ ఎవరి నుండి స్పందన రాలేదు. మంచు విష్ణుకి ఫోన్ చేసాం, కానీ ఆ మధ్య ‘విదేశాల్లో ఉన్నారు’ అనే సమాధానం మాత్రమే విందాం. ప్రభాస్ నుంచి సహాయం వచ్చిందని రూమర్లు వచ్చాయి. అది పూర్తిగా అసత్యం. ఆ వార్తల తరువాత మళ్లీ ఫోన్ చేశాం. కానీ ఎలాంటి స్పందన రాలేదు,” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిష్ వెంకట్‌కి సహాయం చేయాలన్న ప్రయత్నాలు చివరి వరకూ సాగినా… చాలా మందికి విషయం తెలిసే సమయానికి పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయింది. హీరో విశ్వక్ సేన్ సహా కొందరు వ్యక్తిగతంగా ముందుకొచ్చి సహాయం చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ క్లింకార ఫౌండేషన్ నుండి కేవలం రూ. 25,000 వచ్చిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
“నాన్న చాలా సీరియస్‌గానే ఉన్నారు. అయినా ఒక్కరైనా వచ్చి చూసేవారు. గబ్బర్ సింగ్ టీమ్ ఒక్కటే వచ్చారు. నాన్నకి డబ్బు సహాయం జరిగి ఉంటే ఆయన బ్రతికే ఉండేవారు…” అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
వెంకట్ తల్లి మాటల్లో మరింత నొప్పి ఉంది –
“ఇతరులకి ఎవరికి కష్టం వచ్చినా మా కొడుకు ముందుండే వారు. కానీ మా కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే బాధగా ఉంది…” అని విలపించారు.
వైద్య ఖర్చులకు కావాల్సిన నిధులు సమకూర్చలేకపోవడం, కిడ్నీ దాత లభించకపోవడం వల్ల ఓ మంచి మనసున్న నటుడు ఈ లోకాన్ని విడిచిపోయాడు. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి స్పందించినా, ఆ సహాయం సమయానికి చేరలేకపోయింది. ఫిష్ వెంకట్ మృత్యువు టాలీవుడ్‌లో సామూహిక బాధ్యతపై ప్రశ్నలు తేలుస్తోంది.