ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ సినిమాకు సెన్సార్ బోర్డు బ్రేక్ వేసింది. ఈ బయోపిక్కు సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించడంతో, చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
అనంత్ జోషి యోగిగా, పరేశ్ రావల్ ఆయన గురువు మహంత్‌గా నటించిన ఈ సినిమాకు రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించారు. కానీ ఇటీవల సెన్సార్ బోర్డుకు పంపించగానే — “ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వలేము” అంటూ బోర్డు స్పష్టం చేసింది. దాంతో ఇక మార్గం లేక మేకర్స్ నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌ను స్వీకరించిన బాంబే హైకోర్టు, సెన్సార్ బోర్డుపై ఆసక్తికర ప్రశ్నలు వేసింది.
“ఈ సినిమా గత ఎనిమిదేళ్లుగా ప్రచారంలో ఉన్న ఓ నవల ఆధారంగా తీసినదే. ఆ పుస్తకంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. మరి అదే కథను ఆధారంగా తీసిన సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం ఏంటి?” అని కోర్టు నిలదీసింది.
ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు, తాము నిరాకరించిన కారణాలను స్పష్టంగా వివరించాలని ఆదేశించింది.
ఈ వివాదంతో సినిమాకు అకస్మాత్తుగా కలిసొచ్చిన పబ్లిసిటీతో పాటు, యోగి జీవితం వెనుక ఉన్న కథలు, రాజకీయ పరిణామాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.