టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంలో విజయ్ ఈడీ విచారణకు హాజరైన తర్వాత చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. “నువ్వు ప్రొమోట్ చేసిన యాప్ గేమింగ్ యాప్ కాదు, తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ అయిన యథార్థమైన బెట్టింగ్ యాప్!” అంటూ పాల్ మండిపడ్డారు.
విజయ్ వివరణను ఖండించిన పాల్ – “నువ్వు చిన్నవాడివి, మంచి కోసం పోరాడాలి కానీ… ఇలా ప్రజల ప్రాణాలు తీసే యాప్స్‌ని ప్రమోట్ చేయడం తగదు. బుద్ధిగా ఉండు!” అంటూ ఘాటుగా విమర్శించారు. దీంతో ముగిపోకుండా, “ఏం చెప్పావ్? లీగల్ యాప్ అంటావ్? తెలంగాణలో బ్యాన్ అయిందని నీ మాటలతోనే అర్థమవుతోంది కదా!” అంటూ బాణాలు వేశారు.
క్షమాపణ చెప్పి డబ్బు తిరిగి ఇవ్వాలి!
కేవలం విమర్శలతోనే కాకుండా, ఈ వ్యవహారంలో విజయ్ తక్షణమే పబ్లిక్ క్షమాపణ చెప్పాలని, ఆ యాప్ ప్రకటనలతో సంపాదించిన మొత్తాన్ని బాధితుల కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. “నీ యాడ్స్ చూసి ఎంతో మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి బాధ్యత ఎవరిదీ?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. ఈ మేరకు ఓ వీడియో మెసేజ్ కూడా విడుదల చేశారు.
ఈడీ విచారణ – విజయ్ క్లారిటీ
ఇదిలా ఉంటే, ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ – “నేను ప్రచారం చేసినది A23 అనే గేమింగ్ యాప్. ఇది చట్టబద్ధమైనది. ప్రభుత్వ లైసెన్సుతో నడుస్తున్నది. ఇది బెట్టింగ్ యాప్ కాదని స్పష్టం చేశాను” అని తెలిపారు. “తెలంగాణలో ఆ యాప్ అందుబాటులో లేకపోయినా… నేను చేసినది కేవలం కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్ మాత్రమే” అని చెప్పారు. అలాగే తన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను ఈడీకి సమర్పించినట్లు వెల్లడించారు.
సుప్రీంకోర్టులో కేసు – పాల్ మరో స్టెప్
ఇప్పటిదాకా మీడియా స్ధాయిలోనే విమర్శలు చేసిన కేఏ పాల్, ఇప్పుడు చట్టపరంగానూ వ్యవహారంలోకి దిగారు. బెట్టింగ్ యాప్‌లపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. “తెలంగాణలోనే వెయ్యికి పైగా ఆత్మహత్యలు జరిగాయి. ఇక చాలు!” అంటూ యాప్‌లను ప్రోత్సహిస్తున్న సినీ సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.