భారతీయ పురాణాల్లోని శక్తివంతమైన అవతారాలలో ఒకటైన నరసింహుడి ఆధారంగా తెరకెక్కిన “మహావతార్ నరసింహ” సినిమా, ఈ ఏడాది థియేటర్లలో భారీ విజయాన్ని సాధించింది. విజువల్ గ్రాండ్యూర్, రక్తికట్టించే యాక్షన్ సన్నివేశాలు, ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో దేవతా కథనాన్ని కొత్తగా అల్లిన తీరు ప్రేక్షకులను థియేటర్లకు బంధించింది. ముఖ్యంగా యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అందరికీ ఈ మూవీ కనెక్ట్ కావడానికి కారణం – మిథాలజీకి ఆధునిక టచ్, డివోషన్‌తో కలిపిన ఎమోషనల్ కోర్. అందుకే రిలీజ్ అయిన మొదటి వారంలోనే ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ అయిన ఈ సినిమా, ఇప్పుడు ఓటిటీలోకి ఎంట్రీ ఇచ్చి మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది.
థియేటర్ రన్ ముగింపుకు చేరువ అవుతున్న తరుణంలోనే, మహావతార్ నరసింహ ఊహించని విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఎలాంటి భారీ ప్రమోషన్ లేకుండా, కేవలం కొన్ని గంటల ముందే సెప్టెంబర్ 19న రిలీజ్ అని ప్రకటించడం సినీప్రియులను ఆశ్చర్యానికి గురిచేసింది.
నిజానికి ఈ చిత్రానికి రెండు నెలల క్రితం, థియేటర్లకు రాకముందు, డిజిటల్ డీల్ కుదరలేదు. అయితే విడుదల తర్వాత వచ్చిన అద్భుతమైన స్పందన, కలెక్షన్లు, మౌత్ టాక్ కారణంగా ఓటిటి ప్లాట్‌ఫాంల మధ్య పోటీ మొదలైంది. చివరికి ఈ రేసులో నెట్‌ఫ్లిక్స్ ముందంజ వేసి డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది.
ప్రస్తుతం సౌత్ ఇండియన్ కంటెంట్‌పై పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్‌కు మహావతార్ నరసింహ ఒక బంగారు బాతుగా మారనుందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పాన్-ఇండియన్ ఆడియెన్స్‌కు దగ్గరయ్యే మిథాలజికల్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది పెద్ద ఎత్తున వీక్షణలు రాబట్టే అవకాశముంది.
ఇక్కడ హోంబాలే ఫిలిమ్స్ పాత్ర కూడా కీలకం. సలార్, బఘీరా లాంటి ప్రాజెక్టుల డిజిటల్ డీల్స్‌లోనూ వీరే కీలకంగా వ్యవహరించినట్టు ఇండస్ట్రీ టాక్. ఈసారి కూడా మహావతార్ నరసింహకు ప్రెజెంటర్‌గా, డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్‌గా నిలిచిన హోంబాలే, రాబోయే యానిమేషన్ సినిమాల కోసం ప్రొడక్షన్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం.
మొత్తానికి , కంటెంట్ బలంగా ఉంటే ఓటిటీలో ఆలస్యంగా వచ్చినా ప్రేక్షకులు ఎదురు చూసి చూసేస్తారని మరోసారి నిరూపించింది మహావతార్ నరసింహ. ఈ చిత్రం కేవలం ఓ హిట్ కాకుండా, మిథాలజీని కొత్త రూపంలో చూపించి కొత్త మార్గం కూడా చూపించింది.
