తన సినిమాలు వరస పెట్టి ఫెయిల్యూర్ అవటంపై అక్షయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బాక్సాఫీస్ సక్సెస్ రేటు తగ్గడంపై బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ (Akshay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ వల్లే సినిమాలు థియేటర్లలో ఆడటం లేదని ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.దాంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. కొందరు పనిగట్టుకుని మరీట్రోలింగ్ చేస్తున్నారు.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ… ‘‘ఈ మధ్యకాలంలో నేను చాలామందితో సినిమాల గురించి మాట్లాడాను. ఏదైనా సరే తాము ఓటీటీలో చూస్తామని వారు అన్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాలు సరిగ్గా ఆడకపోవడానికి ప్రధాన కారణం అదే.
కొవిడ్ సమయంలో ప్రజలందరూ ఓటీటీ వేదికగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూశారు. ఆ తర్వాత పరిస్థితులు ఎంతో మారినప్పటికీ వారు మాత్రం ఓటీటీకే మొగ్గు చూపిస్తున్నారు. అది వాళ్లకు ఒక అలవాటుగా మారింది’’ అని అక్షయ్ అన్నారు.
అప్పటికీ కంటెంట్ ఎంపిక విషయంలో తాను ఎంతో జాగ్రత్తగా ఉంటున్నానని అక్షయ్ చెప్పారు.
‘కొవిడ్ వల్ల చిత్రపరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ చిత్రాలు చూడాలనే విషయంలో ప్రేక్షకులు చాలా క్లియర్‌గా ఉంటున్నారు. పూర్తిగా వినోదాత్మక, విభిన్నమైన ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం చాలా కీలకం.
నేను కూడా ఆ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నాను. ప్రస్తుత కాలానికి అనుగుణంగా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నా’’ అని తెలిపారు.
అక్షయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’. సారా అలీఖాన్, వీర్ పహారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ కేవ్లానీ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.
జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరి 24న ఇది విడుదల కానుంది. ఇటీవల రిలీజైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరోవైపు, అక్షయ్‌కుమార్ ప్రస్తుతం ‘కన్నప్ప’, ‘స్త్రీ 3’ ప్రాజెక్ట్‌ల కోసం కూడా వర్క్ చేస్తున్నారు.