ఎన్టీఆర్‌పై (NTR) ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి ఆయన ఎన్టీఆర్ లో నటుడుని మెచ్చుకున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ జపాన్‌లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా జపాన్ వెళ్లిన రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘కొమురం భీముడో’ పాట గురించి ప్రస్తావించారు.
రాజమౌళి మాట్లాడుతూ… ‘‘కొమురం భీముడోలాంటి కష్టమైన పాటను చిత్రీకరించడం నాకు చాలా సులభమైందంటే దానికి కారణం ఎన్టీఆర్. అతడు గొప్ప నటుడని అందరికీ తెలుసు. కానీ, ప్రత్యేకించి ఆ పాటలో తారక్ నటన మరో స్థాయిలో ఉంటుంది. అతడి శరీరంలోని అణువణువుతోనూ హావభావాలు పలికించాడు.
నేను ఆ పాట షూటింగ్ లో అతడి ముఖంపై కెమెరా పెట్టి పాట ప్లే చేశాను అంతే. అది ఎంతో గొప్పగా వచ్చింది. ఈ పాట వెనక కొరియోగ్రాఫర్ ప్రతిభ కూడా ఉంది. తారక్‌ను ఎలా కట్టాలి, ఎలా వేలాడదీయాలో బాగా ఆలోచించి కొరియోగ్రఫీ చేశారు’’ అని రాజమౌళి (SS Rajamouli) చెప్పారు.
ఇక ఈ సినిమా తెర వెనక సంగతులతో రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ (RRR: Behind& Beyond) డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.